12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని ‘కుంభమేళా’ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని 'అర్ధ కుంభమేళా' అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను 'మాఘీమేళా' అనే పేరుతో పిలుస్తారు. బాండమును ‘కుంభం’ అని 'కలశం' అని అంటారని మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించినవిధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది.
ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాలపైన చేరి.. అక్కడి నుండి శివుడి జటాజూటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుంచి భువికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని.. త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో మహాకుంభమేళా జరగబోతున్నది.
కుంభమేళాలో..
కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుంచి అనేకానేక వేడుకలు జరుగుతాయి. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, విజ్ఞాన
శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత, మునుల చేత, సన్యాసుల చేత నెలల తరబడిగా ఆ ప్రాంతంలోనే డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త కొత్త విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం అది.
ధర్మరక్షణ కోసం..
కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు, రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయక ఊరేగింపు సమయంలో నాగ సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, అఖాడాలు, కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు.
అనంతరం 'షాహిస్నాన్' పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ, 'ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు'. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు.
సామాజిక సమరసత వెల్లివిరిసే చోటు
పుణ్య స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాల భేదాలు మరిచిపోయి, కులాలు మరిచిపోయి, ఆరాధనా పద్ధతులు ఏవైనా తరతమ భేదాలు పాటించకుండా కుంభమేళా సమయంలో కలసి స్నానాలు చేస్తారు. ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయడం, మంచినీళ్లు, పానీయాలు, అల్పాహారాలు, భోజనాలు అందించడం, రాత్రివేళల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తమతమ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం, వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేస్తుంటారు.
సంత్ సమ్మేళనాలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునఃప్రారంభం
ప్రతి 12 సంవత్సరాలలో ప్రకృతిలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు, నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు. ఇలా లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా చరిత్ర. కానీ, దురదృష్టవశాత్తు రాజా శ్రీహర్షుని పాలనా కాలం 644వ సంవత్సరంలో జరిగిన సంత్ సమ్మేళనం తర్వాత విదేశీ దండయాత్రల కారణంగా సాధారణ పుణ్యస్నానాలు చేయడం జరిగినప్పటికీ, కుంభమేళా సందర్భంగా స్వామీజీల సమావేశాలు, తీర్మానాలు ప్రబోధాలు ఆగిపోయాయి. మళ్లీ 1966వ సంవత్సరం నుంచి పునః ప్రారంభం అయినాయి.
1964 సంవత్సరంలో ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ 1966వ సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో ప్రపంచవ్యాప్తమైన హిందువులతో ‘విశ్వసమ్మేళనం’ నిర్వహించింది. ఆ సమయంలో హిందూ ధర్మంలోని వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన ధర్మగురువులైన నలుగురు శంకరాచార్యులు, వైష్ణవాచార్యులు, నింబార్కాచార్యులు, బౌద్ధ, జైన, సిక్కు, గాణాపత్య, శాక్తేయ అనేకానేక వైవిధ్యం కలిగిన ఆరాధనా పద్ధతులు అనుసరించే వర్గాలకు నేతృత్వం వహించే పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ ప్రయత్నం వందల సంవత్సరాల తర్వాత పూజ్యులు మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ నాయకత్వంలో విశ్వహిందూ పరిషత్ చేసిన ప్రయత్నం కారణంగా సాధ్యపడింది.
2025లో జరిగే కుంభమేళాలో కూడా జనవరి 24, 25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం, 26 తేదీన దేశం నలుమూలల నుంచి 128 వివిధ ఆరాధన మార్గాలకు చెందిన 'సంత్ సమ్మేళనం', 27వ తేదీన 'యువ సంత్' సమ్మేళనం జరగబోతున్నది.స్వాతంత్ర పోరాటానికి ఊపిరిలూదిన కుంభమేళా దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ధార్మిక, ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్య్రం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు.
అంతేకాదు తల్లిని బానిసత్వం నుంచి విడిపించిన గరుత్మంతుడిని గుర్తుచేసుకొని భారతమాతను బందీ నుంచి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకుని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరుగుబాటు, ఆందోళనలు జరగడానికి, స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగాఉపయోగపడేవి.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం
చంద్రమండలం పైన నిలబడి భూమి వైపు చూస్తే కనబడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళా. ప్రపంచంలోనే అతి పెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళా. ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం. సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017 వ సంవత్సరం అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా, 2001వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రాచీన కాలంలో ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 సంవత్సరంలో బెంగాల్ కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా, తులసీ రామాయణాన్ని రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెబుతున్నది.
కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు:
- 1.ఉత్తరాఖండ్లోనిహరిద్వార్ వద్ద గంగానదిలో,
- 2.మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద షిప్రానదిలో,
- 3.మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో
- 4.ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగ, యమున, అంతర్వాహిని సరస్వతి నది సంగమం వద్ద.
మహాకుంభమేళాముఖ్యమైన తేదీలు
- 1. పౌష్య పూర్ణిమ:13-01-2025 (సోమవారం)
- 2. మకర సంక్రాంతి: 14-01-2025 (మంగళవారం మొదటి షాహిస్నానం)
- 3. మౌని అమావాస్య: 29-01-2025 (బుధవారం, రెండో షాహిస్నానం)
- 4. వసంత పంచమి: 03-02-2025 (సోమవారం, మూడో షాహిస్నానం)
- 5. మాఘీ పూర్ణిమ:12-02-2025 (బుధవారం)
- 6. మహాశివరాత్రి:26-02-2025 (బుధవారం)
- ఆకారపు కేశవరాజు,విశ్వహిందూ పరిషత్,కేరళ, తమిళనాడు రాష్ట్రాల సంఘటన మంత్రి–